ఉద్యోగాల వయోపరిమితిపై నిలదీసిన యువత.. ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, ఆగస్టు 12(సిటీ టైమ్స్):
ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు అంశంపై ఎమ్మెల్సీ కోదండరాంను నిరుద్యోగులు నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వద్ద బుధవారం ఆయనను అడ్డుకున్న పలువురు నిరుద్యోగులు తమ సమస్యలపై ప్రశ్నలు సంధించారు.
ఉద్యోగాల వయోపరిమితి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ.. ‘‘60 ఏళ్లకు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కానీ.. 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా?’’ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గతంలో సూచించిన నేపథ్యంలో.. ప్రస్తుతం నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించినట్లు తెలిపారు.
నిరుద్యోగుల ప్రశ్నలకు కోదండరాం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని వారు పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
