Breaking News

ఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్క

  • అన్ని బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్ ఒకేచోట చూసే వెసులుబాటు
  • విడివిడిగా యాప్‌లు మార్చి చూడాల్సిన అవసరానికి చెక్
  • ఖర్చులు–పొదుపుల లెక్కలో మరింత స్పష్టత
    హైదరాబాద్, జూన్ 23 (సిటీటైమ్స్): జీతం కోసం ఒక ఖాతా, పొదుపుల కోసం మరో ఖాతా, రోజువారీ ఖర్చుల కోసం ఇంకో ఖాతా.. ప్రస్తుతం చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. అయితే చేతిలో మొత్తం ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలంటే ఒక్కో బ్యాంకు యాప్‌లోకి వెళ్లి విడివిడిగా బ్యాలెన్స్ చూసుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా యూపీఐకి అనుసంధానమైన అన్ని బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్‌ను ఒకేచోట చూసే ‘టోటల్ బ్యాలెన్స్’ సదుపాయాన్ని Paytm అందుబాటులోకి తెచ్చింది.
    ఈ సదుపాయంతో ఒక్కో ఖాతాలో ఉన్న మొత్తంతో పాటు అన్ని ఖాతాల్లో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం బ్యాలెన్స్ కూడా ఒకేసారి కనిపిస్తుంది. దీంతో డబ్బు ఎక్కడెంత ఉందో తెలుసుకోవడానికి విడిగా లెక్కలు వేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా బహుళ ఖాతాలు నిర్వహించే వారికి ఖర్చులు, పొదుపులు, చెల్లింపులపై వేగంగా అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
    ఈ సదుపాయాన్ని ఉపయోగించేందుకు యాప్‌లోని ‘బ్యాలెన్స్ & హిస్టరీ’ విభాగంలోకి వెళ్లి యూపీఐ పిన్ ద్వారా ఖాతా వివరాలను పరిశీలించాలి. ఆ తర్వాత యూపీఐతో అనుసంధానమైన అన్ని ఖాతాల బ్యాలెన్స్‌ను కలిపి మొత్తం వివరాన్ని చూపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్కో యాప్‌లోకి మారుతూ బ్యాలెన్స్‌లు చూసి లెక్కించాల్సి వచ్చేది. కొత్త సదుపాయంతో ఆ ప్రక్రియ ఒకేచోట పూర్తయ్యే అవకాశం ఉంది.
    నెలవారీ ఖర్చుల సారాంశం, యూపీఐ లావాదేవీల వివరాలు, చెల్లింపుల చరిత్ర వంటి ఇప్పటికే ఉన్న ఇతర సదుపాయాలతో కలిపి రోజువారీ ఆర్థిక నిర్వహణను మరింత సులభంగా చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.