తెల్లాపూర్‌లో ఐదేళ్ల బాలుడి మృతి.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కాలనీవాసుల ఆరోపణ
పటాన్‌చెరు, ఆగస్టు 6 (సిటీటైమ్స్): స్కూల్‌కు వెళ్లిన ఐదేళ్ల చిన్నారి సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని శ్రీకారం వండర్ నెస్ట్ స్కూల్‌లో ఫస్ట్‌క్లాస్ చదువుతున్న షణ్ముఖ్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
స్కూల్‌లో ఉండాల్సిన చిన్నారి బయటకు వెళ్లి సమీపంలోని చెరువు వద్దకు ఎలా చేరుకున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్‌కుమార్, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
