తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన విద్యార్థులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌లోని నియో శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని విద్యార్థులకు పరిచయం చేసేలా నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్, కరస్పాండెంట్ ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పసుపు, కుంకుమ, నైవేద్యాలతో బోనం సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ పండుగల విశిష్టత, బోనాల పండుగ ప్రాశస్త్యాన్ని విద్యార్థులు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. సంప్రదాయ వేషధారణలో పోతురాజులుగా విద్యార్థులు చేసిన విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే ఉద్దేశంతో పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి విందులో పాల్గొని బోనాల వేడుకలను ముగించారు.
