238 ద్విచక్ర వాహనదారులు.. 56 కార్లు, 16 ఆటోలు, ఒక భారీ వాహనం
సైబరాబాద్, ఆగస్టు 9 (సిటీటైమ్స్): వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 311 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. నరేందర్ తెలిపారు.
నమోదైన కేసుల్లో 238 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటో డ్రైవర్లు, 56 కార్ల డ్రైవర్లు, ఒక భారీ వాహనదారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
550 ఎంజీ వరకు బీఏసీ
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్‌ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా పరిశీలించగా.. 255 మందిలో 36 నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 38 మందిలో 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 18 మందిలో 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ మోతాదు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
కేసులు నమోదైన వారందరినీ చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గత వారం 283 కేసుల పరిష్కారం
ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు 283 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 11 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ, 271 మందికి జరిమానా విధించినట్లు వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకుండా వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని, మద్యం మత్తులో వాహనం నడిపి తమతోపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీసులు సూచించారు.
