అమ్మవారి ఆలయాల్లో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): ఆషాఢ మాస బోనాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వివేకానందనగర్‌లోని చిత్తారమ్మ, కనకదుర్గమ్మ ఆలయాలతో పాటు వెంకటేశ్వరనగర్, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, హఫీజ్‌పేట్, చందానగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. కొన్ని ఆలయాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. బోనాల పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసిందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 ఆలయాలకు రూ.30.71 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్, వైద్య సదుపాయాలపై అధికారులు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
