ఆగస్టు 16న వనపర్తిలో నాస్తిక అధ్యయన తరగతులు
వనపర్తి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులేనని, మానవాతీత శక్తులు కాదని నాస్తిక సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. భాస్కర్ అన్నారు. ఆగస్టు 16న వనపర్తి బండారు నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా ‘నాస్తిక అధ్యయన తరగతుల’ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, శాస్త్రీయ దృక్పథంతోనే దేశ ప్రగతి వేగవంతమవుతుందని అన్నారు. దోపిడీ నుంచి కష్టజీవుల విముక్తి కోసం నాస్తిక సమాజం తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. నాస్తికత్వం ఒక సాంస్కృతిక ఉద్యమంగా, చైతన్య శక్తిగా ప్రజలను తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. హేతువాద, నాస్తిక ఉద్యమాలు మూఢనమ్మకాల ప్రచారానికి, దేవుడి పేరిట జరిగే మోసాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంతో పాటు మతం పేరుతో సామాజిక, ఆర్థిక అసమానతలను పెంచిపోషించే వ్యక్తులు, వ్యవస్థలు, వర్గాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం వైపు సమాజాన్ని నడిపిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16న నిర్వహించే అధ్యయన తరగతుల్లో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె. విజయ్‌కుమార్ ‘గతితార్కిక భౌతికవాదం’, తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు అంబటి నాగయ్య ‘మతము–చరిత్ర’ అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. సభకు సీపీఐ జిల్లా నేత రమేష్ అధ్యక్షత వహించనుండగా, సీపీఐ జిల్లా నేత కె. విజయరాములు, సీపీఎం జిల్లా నేత పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా నేత మైత్రి యాదయ్య సందేశాలు ఇస్తారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా నేత గోపాలకృష్ణ ఆహ్వానం పలకగా, ఎస్. భక్తరాజ్ ముగింపు ప్రసంగం చేస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాస్కర్ కోరారు. కరపత్రాల ఆవిష్కరణలో శ్రీరామ్, రమేష్, భక్తరాజ్, ప్రసాద్, శేఖర్, జనార్ధన్, గంధం నాగరాజు, వంశీ, బాలెమియా తదితరులు పాల్గొన్నారు.
