533 మంది తైక్వాండో యోధుల సమర విన్యాసం.. ‘లార్జెస్ట్ తైక్వాండో లెసన్’గా ప్రపంచ రికార్డు
35 నిమిషాల అద్భుత ప్రదర్శన.. ప్రత్యక్షంగా పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధి స్వప్నిల్.. ధ్రువీకరణ పత్రం అందజేత
హైదరాబాద్, ఆగస్టు 9 (సిటీటైమ్స్): గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 533 మంది తైక్వాండో క్రీడాకారులు ఏకకాలంలో ప్రదర్శించిన విన్యాసాలు గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదయ్యాయి. ‘లార్జెస్ట్ తైక్వాండో లెసన్’గా నమోదైన ఈ ప్రదర్శనలో జంపింగ్ కిక్స్, పంచెస్, బ్లాక్స్ తదితర విన్యాసాలను దాదాపు 35 నిమిషాల పాటు ప్రదర్శించారు. ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో, ఇప్పటికే 30 గిన్నిస్ రికార్డులు సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్‌రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ ప్రదర్శనను ప్రత్యక్షంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం విజయవంతమైనట్లు నిర్ధారించారు. అనంతరం నిర్వాహకులకు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ప్రపంచ రికార్డు సాధనలో డాక్టర్ భాస్కర్ పవార్ భాగస్వామ్యం కావడం ప్రత్యేకమని గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్‌రెడ్డి, సుమన్ ఆర్ట్స్ ప్రతినిధి సుమన్ తెలిపారు. క్రీడాకారుల సమిష్టి కృషి, క్రమశిక్షణ, అంకితభావమే ఈ విజయానికి కారణమన్నారు. తైక్వాండో ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఐక్యత వంటి విలువలను పెంపొందించడమే తమ లక్ష్యమని డాక్టర్ భాస్కర్ పవార్ తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు నేలకు గుర్తింపు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ గజేందర్కుమార్, శ్రీకాంత్, సమన్వయకర్త సుమన్, ఖాజా ఆఫ్రిది, ఖలీల్, దరావత్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
