బీసీలే పాలకులుగా ఎదగాలి.. 2028 నాటికి ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండా: తీన్మార్ మల్లన్న
ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడుతాం.. బీసీ రాజ్యం కోసం పోరాటం
హైదరాబాద్, ఆగస్టు 13: తెలంగాణలో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా బానిసలుగా కాకుండా పాలకులుగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీల రాజకీయ సార్వభౌమత్వమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘సర్జికల్ స్ట్రైక్–59’లో భాగంగా కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, హుజూరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసిన ఆయన.. బీసీల ఓట్లతో ఆధిపత్య వర్గాలు రాజకీయ అధికారం అనుభవిస్తున్నాయని ఆరోపించారు.
బీసీల ఓట్లు ఎక్కువ.. అధికారం మాత్రం ఇతరులదే!
కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,20,789 ఓట్లలో బీసీల ఓట్లు 1,40,630 ఉన్నాయని, రెడ్డి సామాజిక వర్గానికి 9,828 ఓట్లు మాత్రమే ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. అయినప్పటికీ రెడ్డి నాయకత్వమే కొనసాగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు.
నిజామాబాద్ రూరల్‌లో 1,63,837 బీసీ ఓట్లు ఉన్నప్పటికీ, 9,620 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూపతిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే రాజకీయాలకు ఇక స్వస్తి పలకాలని, వచ్చే ఎన్నికల్లో బీసీలే అభ్యర్థులుగా బరిలోకి దిగాలని పిలుపునిచ్చారు.
బాల్కొండలో బీసీ అభ్యర్థినే గెలిపిస్తాం
బాల్కొండ నియోజకవర్గంలో 2,21,511 ఓట్లకు గాను 1,43,212 బీసీ ఓట్లు ఉన్నాయని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 8,408 మాత్రమేనని మల్లన్న తెలిపారు. అయినప్పటికీ బీసీలకు కాకుండా ఆధిపత్య వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్పీ తరఫున బీసీ అభ్యర్థిని బరిలోకి దించి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హుజూరాబాద్‌లో ముదిరాజులదే సత్తా!
హుజూరాబాద్ నియోజకవర్గంలో 1,59,068 బీసీ ఓట్లు ఉండగా, రెడ్డి సామాజిక వర్గానికి 18,968 ఓట్లు ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ముదిరాజులు ఐక్యమైతే హుజూరాబాద్‌లో ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకవచ్చని అన్నారు.
‘42 శాతం రిజర్వేషన్లు’ హామీ ఏమైంది?
స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిందని మల్లన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో బీసీలపై ప్రేమను కురిపించిన నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి హక్కులను విస్మరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ హామీ అమలులో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని కోట్లాది మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీలకు సొంత రాజకీయ శక్తి అవసరం
కామారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, పద్మశాలి, గౌడ తదితర బీసీ కులాలకు చెందిన సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పటికీ వారికి పార్టీలు టికెట్లు ఇవ్వకుండా కేవలం అనుచరులుగా ఉపయోగించుకుంటున్నాయని మల్లన్న ఆరోపించారు. బీసీలను బానిసలుగా కాకుండా ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీఆర్పీ పనిచేస్తోందన్నారు.
ఇందులో భాగంగానే జనగామ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ బిక్షపతి ముదిరాజ్‌కు కేటాయించినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర
సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభిస్తామని మల్లన్న ప్రకటించారు. 2028 నాటికి తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ జెండా ఎగురవేసి బీసీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు.
ఆధిపత్య వర్గాల గుర్తులు తొలగిస్తాం
బీసీ ప్రభుత్వం ఏర్పడితే సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగల సాయన్న, ఎర్ర సత్యమన్న వంటి బీసీ మహనీయులకు సముచిత గౌరవం కల్పిస్తామని మల్లన్న తెలిపారు. ఆధిపత్య వర్గాలకు సంబంధించిన విగ్రహాలు, గుర్తులను తొలగిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
బీసీ యువత, మేధావులు ఆధిపత్య రాజకీయాల నుంచి బయటకు వచ్చి తమ సొంత రాజకీయ శక్తిని నిర్మించుకోవాలని మల్లన్న పిలుపునిచ్చారు. బీసీల రాజకీయ సార్వభౌమత్వం కోసం టీఆర్పీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.
