గుండాలలో నవంబర్ 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సభ

అమరుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం

ముఖ్య అతిథిగా సాంస్కృతిక సమాఖ్య జాతీయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క

సభకు హాజరు కావాలని నాయకుల పిలుపు

గుండాల : కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా నవంబర్ 19న గుండాల మండల కేంద్రంలో సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సభకు సాంస్కృతిక సమాఖ్య జాతీయ గౌరవ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోకాళ్ల సమ్మయ్య, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు తెల్లం రాజు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు గడ్డం లాలయ్యతో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వివిధ ప్రజా ఉద్యమాల వరకు అనేక ఆటుపోట్లు, నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో గోదావరి లోయ ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ఒకరని పేర్కొన్నారు.
చండ్ర పుల్లారెడ్డితో పాటు తలమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చారు మజుందార్, సత్యనారాయణ సింగ్, కనయ్ చటర్జీ, నంబాల కేశవరావు తదితర నాయకులతో పాటు గోదావరి లోయ ప్రాంతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అమరులైన అనేక మంది నాయకులు, కార్యకర్తలు, మహిళా ఉద్యమకారుల త్యాగాలను ఈ సభలో స్మరించుకోనున్నట్లు తెలిపారు.
అమరుల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి ఆశయాలు, పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకోవడమే సంస్మరణ సభ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.