అమృత విద్యాలయం రజతోత్సవ వేడుకల్లో శివప్రతాప్ శుక్లా సందేశం
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో కోట్లాది మందికి అమ్మ ఆత్మీయత.. ఓదార్పు
రాజకీయ బాధ్యతలతోపాటు సమాజ సేవకూ ప్రాధాన్యమివ్వాలి
హైదరాబాద్ ,నవంబర్10, (సిటీ టైమ్స్):
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన మాతా అమృతానందమయి (అమ్మ) జీవితం యావత్ సమాజానికి ఆదర్శమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మానవత్వానికి సేవ చేయడాన్ని మించిన గొప్ప కార్యం మరొకటి లేదని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో మంగళవారం మాతా అమృతానందమయి మఠం, అమృత విద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో మఠం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, గ్రామాలను దత్తత తీసుకోవడం, నిరుపేదలకు పింఛన్లు, వస్త్రాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు మఠం మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వ నమామి గంగే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మాతా అమృతానందమయి మఠం రూ.100 కోట్ల విరాళాన్ని అందించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. గత ఐదు దశాబ్దాలుగా దాదాపు నాలుగు కోట్ల మందిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రేమాభిమానాలు పంచిన అమ్మ, 'వసుధైక కుటుంబకం' స్ఫూర్తితో ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలతోపాటు సమాజ సేవకులుగా కూడా పనిచేయాలని సూచిస్తుంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరచుకోవాలని, సమాజంలోని నిరుపేదలు, బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, కరుణ, సామాజిక బాధ్యత, దేశసేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రజతోత్సవాలు జరుపుకుంటున్న మఠం, విద్యాలయం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని, ఆమె సేవా సందేశం భావితరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మాతా అమృతానందమయి రాష్ట్రంలో దత్తత తీసుకున్న గ్రామాలకు చెందిన మహిళలకు అమ్మ, గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా చీరలు, చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జానకి శుక్లా, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎం.కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.