దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు
శేరిలింగంపల్లి, సిటీటైమ్స్:
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండని సైబరాబాద్ పోలీసులు దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిని పలు సూచనలు ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు పేర్కొన్న పలు సూచనల ప్రకారం.. సెలవులలో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచింది. మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం అమర్చుకోవడం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి. మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది. నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి. మీ ఇంట్లో అమర్చిన సిసి కెమెరాలను ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్లు, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి. మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల , బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది. మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు ఇంటిలోపల సిపి కెమెరాలు అమర్చుకొని డివిఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచండి. అల్మరా కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి. సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు. సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా మా వాట్సాప్ నెంబర్ 9490617444 కు డయల్ చేయండి అని పేర్కొన్నారు.