అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి.. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపు

శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఈత కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అర్హులు కూడా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గాంధీ తెలిపారు. సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే లక్ష్యంతో ప్రభుత్వం అర్హులకు అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలు, అభాగ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.ఎవరికెంత పింఛను?వితంతువులు: నెలకు రూ.2,016 పింఛను. 18 ఏళ్లు పైబడిన వారు అర్హులు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.ఒంటరి మహిళలు: నెలకు రూ.2,016 పింఛను. 18 ఏళ్లు పైబడిన వివాహితులు, విడాకులు పొందిన వారు, భర్త వదిలేసిన వారు అర్హులు. భర్తకు దూరంగా ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఉంటున్న వారికి తహసీల్దార్ విచారణ నివేదిక అవసరం. అవివాహిత మహిళల్లో గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన వారు అర్హులు.దివ్యాంగులు: నెలకు రూ.4,016 పింఛను. వయసుతో సంబంధం లేదు. సదరం/యూడీఐడీ ధ్రువపత్రం అవసరం.ఈత కల్లు గీత కార్మికులు: నెలకు రూ.2,016 పింఛను. 50 ఏళ్లు పైబడిన వారు అర్హులు. కల్లు గీత కార్మికుల సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అవసరం.చేనేత కార్మికులు: నెలకు రూ.2,016 పింఛను. 50 ఏళ్లు పైబడిన వారు అర్హులు. చేనేత, వస్త్రాల శాఖ ధ్రువీకరణ అవసరం.పైలేరియా బాధితులు: వయసుతో సంబంధం లేదు. రెండో, మూడో దశ పైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్‌ఓ ధ్రువీకరణ అవసరం.డయాలసిస్ రోగులు: వయసుతో సంబంధం లేదు. డయాలసిస్ చికిత్స పొందుతున్న వారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ నమోదు, ధ్రువీకరణ అవసరం.అర్హతలు.. అనర్హతలు ఇవేదరఖాస్తుదారు భారత పౌరుడై ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. ఇతర ప్రభుత్వ పింఛను లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్న వారు అర్హులు కారు.3 ఎకరాలకు మించి సాగుభూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్టభూమి కలిగిన కుటుంబాలు అనర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు కలిగిన కుటుంబాలు కూడా అనర్హులుగా పేర్కొన్నారు.అయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, రిగ్ యజమానులు వంటి పెద్ద వ్యాపారాలు నిర్వహించే కుటుంబాలు అర్హులు కావు. కారు, జీపు, లారీ తదితర నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు కూడా అనర్హులుగా పేర్కొన్నారు. వైద్యులు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా అర్హులు కాదని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించితే అర్హత ఉండదని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పింఛను లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులని పేర్కొన్నారు.దరఖాస్తు ఇలా..ఒకే విధమైన దరఖాస్తు ఫారాన్ని కింది వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నమోదు చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సీఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.దరఖాస్తు వెబ్‌సైట్:https://cheyutha.telangana.gov.in
