రూ.2 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్ ప్రయాణికుడికి అప్పగింత
మేడ్చల్, ఆగస్టు 9 (సిటీటైమ్స్): నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు మేడ్చల్ ఆర్టీసీ డిపో కండక్టర్ గోవింద్. బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌ను గుర్తించి, అందులోని సుమారు రూ.2 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులను భద్రపరిచి ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు.
ఆగస్టు 8న పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న 215/2 సర్వీసు బస్సులో కేపీహెచ్‌బీ వద్ద ప్రశాంత్ అనే ప్రయాణికుడు బ్యాగ్‌తో ఎక్కారు. రాత్రి 1.15 గంటల సమయంలో పాట్నీ వద్ద దిగిపోయారు. అనంతరం బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా కండక్టర్ గోవింద్ బస్సులో ప్రయాణికుడు వదిలివెళ్లిన బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే డిపో అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
మరుసటి రోజు బ్యాగ్‌ను విజిలెన్స్ సిబ్బంది నరసింహకు అప్పగించారు. బ్యాగ్‌ను పరిశీలించగా అందులో సుమారు రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు పర్సులు, చార్జర్, కొత్త దుస్తులు, కార్యాలయ గుర్తింపు కార్డు తదితర విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్‌లో లభించిన సంప్రదింపు నంబర్ ఆధారంగా ప్రయాణికుడు ప్రశాంత్‌ను సంప్రదించి డిపోకు పిలిపించారు. ఆయన సమక్షంలో బ్యాగ్‌లోని వస్తువులను పరిశీలించి, నగదుతో సహా అన్ని వస్తువులను సురక్షితంగా తిరిగి అప్పగించారు.
తన విలువైన వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు తిరిగి లభించడంతో ప్రశాంత్ ఆనందం వ్యక్తం చేశారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఎం.డీ. ఇస్మాయిల్‌తో పాటు డిపో సిబ్బందిని అధికారులు అభినందించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావు, ఎర్నింగ్ విభాగం తిరుపతయ్య, కంట్రోలర్లు అనిల్, శ్రీనివాస్, డిపో సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
