మణుగూరు ;భూ రీసర్వే లో భాగంగా భూముల వివరాలు, సరిహద్దులు, సర్వే మ్యాప్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని, భూ రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్దేశిత ప్రణాళిక ప్రకారము సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.మంగళవారం మణుగూరు మండలం చినరావి గూడెం గ్రామంలో జరుగుతున్న పునసర్వే పనులను ఆయన తనిఖీ చేశారు.గ్రామంలోని ఎంజాయ్మెంట్ సర్వే( భూ వినియోగ సర్వే) పునః పరిశీలన పనుల పురోగతిని పరిశీలించారు.ఖచ్చితమైన మరియు సరైన భూ రికార్డుల నిర్వహణను నిర్ధారిస్తూ నిర్ణీత గడవలోగా సర్వే పనులను పూర్తి చేయాలని సర్వేయర్ బృందానికి ఆదేశించారు.
అనంతరం చినరావి గూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య రోజువారి హాజరు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.బోధన విధానం,విద్యార్థుల అభ్యాసన స్థాయి, పాఠశాలల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతి విద్యార్థి విద్యా ప్రగతి పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా అందించేలా కృషి చేయాలని ఆయన అన్నారు.అనంతరం తరగతి గదులు, మరుగుదొడ్లు చేతులు కడుక్కునే ప్రదేశం తాగునీటి సౌకర్యాలను తనిఖీ చేసి భోజనం నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.