వనపర్తి సిటీ టైమ్స్ నవంబర్ 10

 జిల్లాలో వర్షాభావం, నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వీడి తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా పరిపాలనాధికారి (ఏవో) భానుప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రమేష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయరాములు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సీపీఐ బృందాలు పర్యటించి పరిస్థితులను పరిశీలించాయని తెలిపారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వరితో పాటు రబీలో వేసిన వేరుశనగ, మినుము తదితర పంటలు నీళ్లు, విద్యుత్‌ కొరతతో నిలువునా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి చేలు పొట్టదశ, పాలుపోసుకునే దశలోనే ఎండిపోవడంతో అన్నదాతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీరు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత తీవ్రమైందన్నారు.
మిగిలిన 4 మండలాలనూ చేర్చాలి:
జిల్లాలో ఇప్పటికే 11 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ప్రాజెక్టులు ఉన్నాయన్న నెపంతో రేవల్లి, చిన్నంబావి, శ్రీరంగాపూర్, మదనాపూర్ మండలాలను మినహాయించడం సరికాదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆ నాలుగు మండలాలనూ కరవు జాబితాలో చేర్చాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కర్ణాటక నుంచి జూరాలకు నీటిని రప్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేయడం తగదన్నారు.
ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలి:
రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం భారీగా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.30,000, వాణిజ్య పంటలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు, ఆరుతడి పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి లేని వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి పనులు కల్పించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కళావతమ్మ, మోషే, రాబర్ట్, భాస్కర్, గోపాలకృష్ణ, రవీందర్, పృథ్వీనాథం, కుతుబ్, సంతోష్, కాకం బాలస్వామి, మల్లెపు బాలస్వామి, బాలరాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.