ఆగస్టు 13 నుంచి ప్రత్యేక కార్యక్రమం.. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు
పంజాగుట్ట, ఆగస్టు 10 (సిటీటైమ్స్): గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ తెలిపారు. గత ఐదేళ్లుగా ఏటా కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఉచిత శస్త్రచికిత్స కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు వైద్య బృందం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఆగస్టు 13 నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ. అమరేశ్వర్ నేతృత్వంలో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. చిన్నారులను నేరుగా ఆసుపత్రికి వచ్చి చూపించే విధానంలో పరిశీలిస్తారు. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న వారికి ప్రాధాన్యత కేటాయించి ఉచితంగా చికిత్స అందిస్తారు. అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి వైద్యులను సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు. గతంలో చేయించిన వైద్య పరీక్షలు, స్కాన్లు, ఈసీజీ, ఎకో తదితర నివేదికలు ఉంటే తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. సీటీ సర్జరీ కార్యాలయం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, నిమ్స్, పంజాగుట్టలో వైద్యులను సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 040-2348-9025 నంబరులో సంప్రదించవచ్చు. చిన్నారుల గుండె ఆరోగ్యానికి భరోసా కల్పించడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ ఉచిత శస్త్రచికిత్స కార్యక్రమం ఉపయోగకరంగా నిలవనుంది.
