గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేకానంద
సమస్యలు పరిశీలించి.. తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): భౌరంపేట్‌లో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలపై బీఆర్ఎస్‌ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టి సారించారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని గ్రామంలో బుధవారం స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఆయన.. సమస్యలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు.
దెబ్బతిన్న ప్రధాన రహదారులు, సరిగా పనిచేయని డ్రైనేజీ వ్యవస్థ, రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు. గ్రామ పెద్దలు, కాలనీల ప్రతినిధులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దెబ్బతిన్న రహదారులకు త్వరగా మరమ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం ఇస్తామని వివేకానంద తెలిపారు.
పర్యటనలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, వివిధ కాలనీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
