* రాష్ట్రపతి భవన్లో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్లతో ముఖాముఖి
* సామాజిక, ఆర్థిక బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు
న్యూఢిల్లీ, నవంబర్ 10 (సిటీటైమ్స్):
రాష్ట్రపతి భవన్లో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువ అధికారులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. చట్టాలు, నిబంధనలు అధికార బలప్రాప్తిని ఇస్తాయని, అయితే ప్రజల విశ్వాసం, అంతర్గత నైతిక విలువల వల్లే సమాజంలో నిజమైన గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు.
ఉన్నతాధికారులను నేరుగా కలవలేని నిస్సహాయులు, సామాజిక, ఆర్థిక బలహీన వర్గాల ప్రజల్లో పోలీసు వ్యవస్థపై ఉన్న భయాలను తొలగించాల్సిన బాధ్యత మీపైనే ఉందని రాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. సామాన్యుల సమస్యలను సానుభూతితో ఆలకించి, తక్షణ పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే పోలీస్ సర్వీసుకు సార్థకత చేకూరుతుందని ప్రొబేషనర్లకు సూచించారు.