* హైదరాబాద్‌లో 23 క్లౌడ్ కిచెన్లపై మెరుపు దాడులు.. 700 కిలోల కుళ్లిన ఆహారం నేలమట్టం

 * బిర్యానీ బై కిలో, సోడెక్సో సహా 8 సంస్థల లైసెన్సులు రద్దు.. మరో 15 హోటళ్లకు నోటీసులు

శేరిలింగంపల్లి, నవంబర్ 10 (సిటీటైమ్స్):

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బడా క్లౌడ్ కిచెన్లు, ప్రముఖ రెస్టారెంట్ల అసలు బండారాన్ని ఆహార భద్రతా విభాగం బట్టబయలు చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని 23 కిచెన్లపై 24 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. మురుగు కంపు కొడుతున్న వంటిళ్లు, ఎలుకలు కొరికిన ఆలుగడ్డలు, బొద్దింకలు తిరుగుతున్న నిల్వ గదులు, పురుగులు పట్టిన పిండితో వంటలు చేస్తున్న వైనాన్ని గుర్తించిన అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెనువెంటనే ప్రజారోగ్యానికి హానికరంగా మారిన దాదాపు 700 కిలోల కుళ్లిన, కల్తీ ఆహార పదార్థాలను రోడ్డుపై పారబోసి ధ్వంసం చేశారు.

తీవ్ర నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన బిర్యానీ బై కిలో, సోడెక్సో, కుల్చా కల్చర్, లక్కీ మల్టీకుజిన్, టుమ్ యమ్, జోరా, ఎల్ఓ ఫ్రెష్, ఐటీసీ ఆశీర్వాద్ సహా ఎనిమిది సంస్థల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి కార్యకలాపాలు నిలిపివేయించారు. మరో పది కిచెన్లకు షోకాజ్ నోటీసులు, ఐదు హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. అనుమానిత 25 ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, ఆహార నాణ్యతలో రాజీపడితే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.