మాదారంలో డోర్ల పరిశ్రమల ఇష్టారాజ్యం?

సంగం కుంటలో వ్యర్థాల డంపింగ్‌.. అనంతరం నిప్పంటించిన వైనం!

• గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో పర్యావరణ కాలుష్యంపై పట్టించుకోని అధికార యంత్రాంగం

పటాన్‌చెరు, నవంబరు 11 (సిటీటైమ్స్‌):

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం తొలగించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. కానీ మాదారం గ్రామంలోని సంగం కుంటలో పరిశ్రమ వ్యర్థాలను డంపింగ్‌ చేసి, వాటికి నిప్పంటించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వెలువడుతున్న పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో డోర్ల పరిశ్రమల వ్యర్థాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలోని సంగం కుంటలో పరిశ్రమ వ్యర్థాలను అక్రమంగా డంపింగ్‌ చేసి, అనంతరం వాటికి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కాలుతుండటంతో వెలువడుతున్న దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్ముకుంటోందని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పరిశ్రమల కార్యకలాపాలతో పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుంటే, మరోవైపు వ్యర్థాలను బహిరంగంగా పడేసి తగలబెట్టడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. వ్యర్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ పరిశ్రమకు చెందినవి? వాటిని కుంటలో ఎవరు డంపింగ్‌ చేశారు? నిప్పంటించిన వారెవరు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి సంగం కుంటను పరిశీలించి, వ్యర్థాల నమూనాలను సేకరించి, బాధ్యులైన పరిశ్రమలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారా? లేక ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని గాలికొదిలేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.