Breaking News

తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యం

● గచ్చిబౌలిలోని అల్‌సబా రెస్టారెంట్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు
● ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ సస్పెన్షన్‌కు చర్యలు.. లోపాల సవరణ వరకు రెస్టారెంట్ మూసివేతకు ఆదేశం

సైబరాబాద్, జూలై 9 (సిటీటైమ్స్):
గచ్చిబౌలిలోని అల్‌సబా రెస్టారెంట్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫుడ్ సేఫ్టీ బృందాలు గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఆహార పదార్థాల నిల్వ, వంటశాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో తీవ్ర లోపాలు గుర్తించిన అధికారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ సస్పెన్షన్‌కు చర్యలు ప్రారంభించారు. గుర్తించిన లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఆహార భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
తనిఖీల్లో ఫ్రీజర్‌లో మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం, పాత్రలు శుభ్రం చేసే ప్రాంతంలో నీరు నిల్వ ఉండటం, సిబ్బంది వాష్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఈగల సంచారం కనిపించడం, పాత్రలను వేడి నీటితో శుభ్రపరిచే విధానం పాటించకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. అపరిశుభ్రమైన వాష్‌రూమ్‌లకు ఆనుకుని రుమాలి రొట్టెలు తయారు చేయడం, కోళ్ల వధ ప్రాంతంలో పరిశుభ్రత లోపించడం, మిగిలిన చికెన్ నిల్వకు ప్రత్యేక కంటైనర్లు లేకపోవడం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. తాగునీటి నాణ్యత పరీక్షల నివేదికలు, ఆహార తయారీలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వైద్య ఫిట్‌నెస్ ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడాన్ని కూడా అధికారులు నమోదు చేశారు. అయితే ఆహారంలో నిషేధిత కృత్రిమ రంగులు ఉపయోగించిన ఆనవాళ్లు కనిపించకపోవడం, సిబ్బంది హెయిర్‌నెట్‌లు ధరించడం వంటి అంశాలను సానుకూలంగా పేర్కొన్నారు.
పరిశుభ్రత అంచనాలో 150 మార్కులకు గాను అల్‌సబా రెస్టారెంట్‌కు కేవలం 69 మార్కులు (46 శాతం) మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన అధికారులు, అన్ని లోపాలను సరిదిద్దిన తర్వాత మరోసారి తనిఖీలు నిర్వహించి ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలిస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాతే రెస్టారెంట్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.