సైబరాబాద్ కమిషనరేట్‌లో జయంతి సందర్భంగా నివాళులు
సైబరాబాద్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన కృషి, ఆయన సిద్ధాంతాలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని సీపీ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొని నివాళులర్పించారు.
