ఒంటరిగా ఉన్న మహిళపై దాడి.. నాలుగు తులాల బంగారం అపహరణ
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి జాడ పట్టిన మియాపూర్ పోలీసులు
ఏపీలోని కనిగిరిలో అరెస్టు.. మంగళసూత్రం స్వాధీనం
సైబరాబాద్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): కొరియర్ డెలివరీ ఏజెంట్‌గా ఇంట్లోకి వచ్చాడు.. మహిళ ఒంటరిగా ఉందని నిర్ధారించుకున్నాడు.. ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి నాలుగు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. ఈ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు నిందితుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో అరెస్టు చేశారు. అతడిని షేక్ ఖాజా అర్షల్ (20)గా గుర్తించారు.
జులై 31న ఆయుర్వేద మందులు డెలివరీ చేసేందుకు వచ్చినట్లు చెప్పి నిందితుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడని పేర్కొన్నారు. బి.ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడి జాడ గుర్తించారు. కనిగిరిలో అతడిని అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన నాలుగు తులాల మంగళసూత్రంతో పాటు ఘటన సమయంలో ఉపయోగించిన ఆయుర్వేద మందుల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలోనూ కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కొరియర్, డెలివరీ ఏజెంట్ల పేరుతో వచ్చే అపరిచితుల వివరాలు నిర్ధారించుకోకుండా తలుపులు తెరవొద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
