రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా కర్ణాటకలో అటువంటి ఒక ఊహించని ఘటనే చోటుచేసుకుంది. తుమకూరు నుండి మధుగిరి వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సదరు ప్రయాణికురాలిని చూసి బస్సులోని మిగిలిన వారు ఏం చేయాలో పాలుపోక కంగారుపడ్డారు.అయితే, ఆ సమయంలో బస్సు డ్రైవర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా, తన రూట్ మార్చాడు. బస్సును నేరుగా సమీపంలోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి పోనిచ్చాడు.సరిగ్గా సమయానికి ఆసుపత్రికి చేర్చడం, అక్కడ వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించడంతో సదరు మహిళ ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడింది. సమయానికి దేవుడిలా స్పందించి ఒకరి ప్రాణాన్ని కాపాడిన ఆ డ్రైవర్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన ఆ డ్రైవర్ రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
